: మానవ రహిత జలాంతర్గామితో సత్తాచాటిన చైనా
మానవరహిత జలాంతర్గాములతో చైనా సత్తాచాటింది. సముద్ర గర్భంలో పరిశోధనల్లో చైనా అద్భుతమైన పురోగతి సాధించింది. చైనా తయారు చేసిన మానవరహిత జలాంతర్గాములు 10 వేల మీటర్ల లోతుకు వెళ్లి పరీక్షలు విజయవంతంగా నిర్వహించాయని చైనా పరిశోధకులు వెల్లడించారు. షాంగై విశ్వవిద్యాలయంలోని హడాల్ లైఫ్ సైన్సెస్ పరిశోధన కేంద్రం డెరెక్టర్ క్యూ వీచెంగ్ నేతృత్వంలో అత్యంత లోతైన మారియానా జలసంధిలో ఈ అధ్యయనం చేపట్టినట్టు చైనా పేర్కొంది. మూడు మానవరహిత జలాంతర్గాములతో పాటు పరిశోధక బృందం జాంగ్ జియాన్ అనే ఓడలో డిసెంబర్ 3న బయల్దేరింది. అనంతరం మారియానా జలసంధిలోకి డిసెంబర్ 25–27 మధ్య ఈ జలాంతర్గాములు వెళ్లాయని చైనా ప్రభుత్వ మీడియా సంస్థ గ్జిన్హువా వెల్లడించింది.
మొదటి మానవరహిత జలాంతర్గామి సముద్ర గర్భ ఛాయాచిత్రాలు తీయగా, రెండో మానవరహిత జలాంతర్గామి అవక్షేప నమూనాలను, మూడో జలాంతర్గామి 103 ఆంఫిపోడ్ల (ఒకరకమైన సముద్ర జీవులు) నమూనాలను మోసుకొచ్చాయని వెల్లడించింది. దీంతో 10 వేల మీటర్లు లేదా అంతకన్నా లోతుకు వెళ్లే జలాంతర్గాములను తయారుచేసుకున్న మూడో దేశంగా చైనా అవతరించింది. ఈ జాబితాలో చైనా కంటే ముందు అమెరికా, జపాన్ దేశాలున్నాయి. దీంతో చైనా 2019 లేదా 2020 నాటికి 10 వేల మీటర్ల లోతుకు వెళ్లే మానవసహిత జలాంతర్గాములను పూర్తి స్థాయిలో తయారు చేయలగదని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.