: పోలవరం నిర్మాణంలో నేడు కీలక ఘట్టం.. హాజరుకానున్న కేంద్రమంత్రులు... లక్షలాదిమందితో బహిరంగ సభ
ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నేడు కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇన్నాళ్లూ సాగిన మట్టి పని స్థానే నేడు కాంక్రీట్ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అత్యంత ముఖ్యమైన ఈ ఘట్టం ఈరోజు మధ్యాహ్నం 1:59 గంటలకు ఆవిష్కృతం కానుంది. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు సహా పలువురు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. ప్రజలు, మంత్రుల సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరం స్పిల్‌వే పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దీంతో ఇప్పటికే ఈ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.
స్పిల్‌వే పనుల ప్రారంభోత్సవాన్ని రైతులు, ప్రజల మధ్య పండుగలా నిర్వహించాలని భావిస్తున్న చంద్రబాబునాయుడు అందుకు తగ్గ ఏర్పాట్లు చేయించారు. పోలవరం నిర్వాసితులు, ఉభయగోదావరి జిల్లాల రైతులతోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం ప్రాజెక్టు సమీపంలోనే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు లక్షలాదిమంది ప్రజలు హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 70 ఏళ్ల క్రితం ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు మూడు దశాబ్దాలపాటు కాగితాలకే పరిమితమైంది. ఇప్పుడు అది కార్యరూపం దాల్చుతుండడంతో రాష్ట్రంలో పండుగ వాతావరణం కనిపిస్తోందని జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.