: రేపు ప్రధాని జాతిని ఉద్దేశించి ఏం చెబుతారంటే... మొదలైన ఊహాగానాలు!
నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన రోజు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోదీ రేపు(శనివారం) మరోమారు ప్రసంగించనున్నారు. ప్రధాని మరోమారు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారన్న ప్రకటన రాగానే దేశవ్యాప్తంగా మరోమారు చర్చనీయాంశమైంది. ప్రధాని ఏం మాట్లాడబోతున్నారు? అన్న చర్చ మొదలైంది. ప్రజల కష్టాలు తీర్చడానికి మోదీ అడిగిన 50 రోజుల గడువు నేటి రాత్రితో ముగియనున్న నేపథ్యంలో శనివారం రాత్రి ఆయన ప్రసంగం ఉంటుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు.
పెద్దనోట్ల రద్దు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను ప్రజలకు వివరించడంతోపాటు భవిష్యత్తులో చేపట్టే చర్యల గురించి ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే నోట్ల రద్దుతో సాధించిన విజయాలతోపాటు నష్టాలను కూడా వివరిస్తారని సమాచారం. అలాగే ప్రజలకు బోల్డన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ప్రసంగంలో ఐదు కీలక అంశాలు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఆ ఐదు ఇవే..
పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్తగా రూ.2 వేల నోట్లను చలామణిలోకి తెచ్చింది. ఇప్పుడీ నోట్లను కూడా రద్దు చేయనున్నట్టు ప్రధాని ప్రకటిస్తారు. అలాగే రూ.వంద లోపు ఉన్న చిన్ననోట్ల స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ తీసుకు రావాలన్న నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. రెండోది.. రైతుల పంట రుణాలను పూర్తిగా రద్దు చేయడం. మూడోది జీరో బ్యాలెన్స్ ఉన్న జన్‌ధన్ ఖాతాల్లో రూ.10 వేలు జమచేయడం, నాలుగోది నగదు ఉపసంహరణపై ప్రస్తుతమున్న ఆంక్షలు ఎత్తివేయడం, చివరిది బినామీ ఆస్తులపై తీసుకునే చర్యల విషయంలో కీలక ప్రకటన ఉండే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.