: సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని చెప్పి ... బాలికపై 17 రోజుల పాటు అత్యాచారం!
మైనర్ బాలికకు సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని నమ్మించి 17 రోజుల పాటు అత్యాచారం చేసిన ఘటనలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లతో పాటు మరో ఇద్దరిని హైదరాబాదు, బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని, కోర్టు ఆదేశంతో రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... సినిమాల్లో డ్యాన్సర్ గా స్థిరపడాలనే ఉద్దేశంతో బాలిక (15) బంజారాహిల్స్ రోడ్ నెం.2 లోని ఇందిరానగర్ లో నివాసముండే మేనమామ ఇంటికి వచ్చింది.
అనంతరం తెలిసిన వారి వద్ద తన ఆసక్తిని చెప్పడంతో, అదే ప్రాంతంలో నివాసం ఉంటూ సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ లుగా పని చేస్తున్న షేక్ అక్బర్ (21), తూము వెంకారెడ్డి (22), ప్రొడక్షన్ అసిస్టెంట్ గా పని చేస్తున్న నండూరి పాపారావు అలియాస్ గణేష్ (31) మోయినాబాద్ వాసి గుడుపల్లి నవీన్ కుమార్ (19) లు ఆమెపై కన్నేశారు. తాము సినిమాల్లో పని చేస్తున్నామని, సినిమాల్లో అవకాశం కల్పిస్తామని మాయమాటలు చెప్పి ఆమెను ఈ నెల 3వ తేదీన రంగారెడ్డి జిల్లా నందిగామకు తీసుకెళ్లారు. అక్కడ వారికి మరో స్నేహితుడు కుమార్ జతకలిశాడు. ఈ ఐదుగురు ఆ బాలికను ఇందిరానగర్ తో పాటు చింతల్, జీడిమెట్ల, నందిగామ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా 17 రోజుల పాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
వారి అరాచకాన్ని తాళలేక వారి బారి నుంచి తప్పించుకుని బయటపడ్డ ఆ బాలిక బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న ఫోన్ నంబర్ల ఆధారంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై ఐపీసీ సెక్షన్ 376 (డి), సెక్షన్ 5 (జి), రెడ్ విత్ 6, పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. సినిమాల్లో పని చేస్తున్న వారంతా పట్టుబడగా, నందిగామలో కలిసిన కుమార్ పరారీలో ఉన్నాడు. అతనికోసం గాలింపు చేపట్టారు.