: పెద్ద నోట్ల రద్దుపై ముందు నుంచీ నాది ఒకే మాట..!: తేల్చి చెప్పిన చంద్రబాబు
పెద్దనోట్ల రద్దుపై తాను ముందునుంచీ ఒకే అభిప్రాయంతో ఉన్నానని, మధ్యలో మాట మార్చలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల కమిటీ నాలుగో సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రెండుగంటలపాటు వివిధ అంశాలపై చర్చించినట్టు చెప్పారు. ఆన్లైన్ లావాదేవీల చార్జీలపై ఈనెల 31 వరకు ఉన్న మినహాయింపును పొడిగించాలని కేంద్రానికి సిఫార్సు చేయనున్నట్టు చెప్పారు.
ప్రపంచంలోని అత్యుత్తమ పద్ధతులను పరిశీలించి వారం రోజుల్లో మధ్యంతర నివేదిక సమర్పిస్తామన్నారు. టీసీఎస్ రూపొందించిన వ్యవస్థ ద్వారా ఆధార్ నంబర్, బ్యాంకు పేరు తెలిస్తే లావాదేవీలు జరుపుకోవచ్చని తెలిపారు. సాధారణ మొబైల్ ఫోన్ నుంచి చెల్లింపులు చేసే యూఎస్ఎస్డీ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తున్నట్టు వివరించారు. స్మార్ట్ఫోన్ల ద్వారా లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు త్వరలో యూపీఐ యాప్ను విడుదల చేస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుపై తాను మాటమార్చలేదని, తొలి నుంచి ఒకే అభిప్రాయంతో ఉన్నానని మరోమారు స్పష్టం చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయాలనేదే తన డిమాండ్ అని పేర్కొన్నారు.