: అఖిలేష్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించిన నేరగాడికి టికెట్!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తికి ములాయం సింగ్ యాదవ్ సీటు కేటాయించడం కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు దగ్గరవుతున్న కొద్దీ ములాయం కుటుంబంలో లుకలుకలు తగ్గలేదని బహిర్గతమవుతోంది. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నేడు విడుదల చేసిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో కరుడుగట్టిన నేరగాడు అతిక్ అహ్మద్ అనే వ్యక్తి పేరు కూడా వుంది. ఇతనికి సీటివ్వడాన్ని అఖిలేష్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించారు.
అతిక్ పై 44 కేసులున్నాయి. అందులో హత్య సహా పలు నేరాలన్నీ ఉన్నాయి. దీంతో అఖిలేష్ అతనిని తీవ్రంగా వ్యతిరేకించాడు. అయితే అతనికి అఖిలేష్ బాబాయి శివపాల్ యాదవ్ మద్దతిచ్చారు. అఖిలేష్ డిమాండ్లను పట్టించుకోని ములాయం సింగ్ యాదవ్ తమ్ముడు శివపాల్ యాదవ్ జాబితాకు పెద్దపీట వేశారు. దీంతో అతిక్ కు సీటు లభించింది. ఇలాంటి నేరగాళ్లు పదుల సంఖ్యలో సీట్ల సంపాదించినట్టు తెలుస్తోంది. దీనిపై అఖిలేష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.