: శశికళ రాజకీయ భవితవ్యం తేలేది రేపే... మరోసారి ఘర్షణ తప్పదా?


తమిళనాట రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. శశికళ భవిత్యం రేపు తేలిపోనుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆల్‌ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టనున్నారన్న సస్పెన్స్ కు రేపు తెరపడనుంది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి సి.పొన్నయ్యన్ మాట్లాడుతూ, పార్టీ ప్రధాన కార్యాలయంలో రేపు (గురువారం) జరగనున్న కీలక సమావేశంలో పార్టీ జనరల్‌ సెక్రటరీని ఎన్నుకుంటామని అన్నారు.

పార్టీ జనరల్‌ సెక్రటరీ పదవికి సంబంధించి ఇప్పటి వరకు శశికళ సహా ఏ ఒక్కరూ నామినేషన్‌ దాఖలు చేయలేదని ఆయన వెల్లడించారు. శశికళను పార్టీ జనరల్‌ సెక్రటరీగా కాకుండా ఏకంగా ముఖ్యమంత్రిగానే ఎన్నుకోబోతున్నారన్న వార్తలపై పొన్నయ్యన్‌ ఆచితూచి స్పందిస్తూ, రేపటి సమావేశం కేవలం పార్టీ జనరల్‌ సెక్రటరీ ఎన్నిక కోసం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

కాగా, తాను కూడా జనరల్ సెక్రటరీ పదవి రేసులో ఉన్నానని, విషప్రయోగం వల్లే జయలలిత మరణించారని వాదిస్తున్న ఎంపీ శశికళా పుష్ప తెలపడంతో ఆసక్తి రేగుతోంది. దానికి తోడు నేడు ఆమె తరపు నామినేషన్ వేసేందుకు వెళ్లిన ఆమె లాయర్ ను శశికళ వర్గం దాడి చేయడంతో రేపు ఆమె స్వయంగా మీటింగ్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆమెను కార్యాలయంలోకి అనుమతించకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె ఎలా స్పందిస్తారన్న దానిపై ఆసక్తి రేగుతోంది. రేపటి సమావేశంలో తమిళనాట అధికారం కోసం వేచి చూస్తున్న వర్గాల అసలు రంగు బట్టబయలవుతుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. దీంతో అధికారికంగా నిర్వహించబోయే ఎన్నిక ప్రక్రియలో ఏం జరగబోతుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

  • Loading...

More Telugu News