: దర్శకుడు పూరి ఆఫీసులో ఉండగా వర్మ నన్ను సెలెక్ట్ చేశారు: ‘వంగవీటి’ హీరో శాండీ
‘వంగవీటి’ చిత్రంలో తనకు హీరోగా నటించే అవకాశం ఏ విధంగా లభించిందనే విషయాన్ని హీరో శాండీ వివరించి చెప్పారు. హైదరాబాద్ లో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘వంగవీటి’ చిత్రానికి, ఈ చిత్రంలోని పాత్రలకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో వంగవీటి రాధా, రంగా పాత్రలను పోషించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
‘దర్శకుడు పూరి జగన్నాథ్ గారి ‘జ్యోతిలక్ష్మి’ చిత్రంతో నేను వెండితెరకు పరిచయమయ్యాను. ఒకసారి, పూరి గారి ఆఫీసులో నేనుండగా, దర్శకుడు వర్మ గారు నన్ను చూశారు. ఆ తర్వాత ‘వంగవీటి’ చిత్రంలో రాధా పాత్రకు నన్ను ఎంపిక చేశారు. అయితే, రాధా, రంగాలకు పోలికలు ఉన్నందున రంగా పాత్రలోనూ నన్నే నటించమనడంతో, రెండు పాత్రలను పోషించాను. ఈ సినిమా షూటింగ్ కు ముందు నేను కొంత హోం వర్క్ చేశాను. ఆ రెండు పాత్రలకు సంబంధించిన మేనరిజమ్స్, నటన.. తదితర విషయాలకు సంబంధించి వర్మ గారి సూచనల్ని పాటించి, ఆయన చెప్పినట్లే యాక్ట్ చేశాను. ఆ రెండు పాత్రల్లో బాగా నటించానని ప్రశంసలు అందుతున్నాయి. ఈ చిత్రం విడుదల తర్వాత నాకు ఎటువంటి బెదిరింపులు రాలేదు’ అని శాండీ చెప్పుకొచ్చాడు.