: హఠాత్తుగా వచ్చి పడిన ఆ డబ్బు తన జీవితాన్ని నాశనం చేసిందంటున్న ఆస్ట్రేలియన్!
తన అకౌంట్ లో పొరపాటున క్రెడిట్ అయిన డబ్బు తన జీవితాన్ని నాశనం చేసేసిందని ఆస్ట్రేలియాకు చెందిన లూక్ బ్రెట్ మూర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. క్రిమినల్ లా కోర్సు చదువుతున్న లూక్ అలా అనడానికి కారణమేంటంటే... మార్చి 2010లో ఆస్ట్రేలియాలోని పెద్ద బ్యాంకుల్లో ఒకటైన సెయింట్ జార్జ్ బ్యాంకులో లూక్ ఖాతా తెరిచాడు. అదే ఏడాది జూలైలో సాంకేతిక తప్పిదం కారణంగా లూక్ అకౌంట్ లో భారీగా డబ్బులు జమ అయ్యాయి. దీనిని వినియోగించుకోవాలని భావించిన లూక్ 50 సార్లు బ్యాంకు నుంచి డబ్బు విత్ డ్రా చేశాడు.
వాటితో చేసిన అప్పులన్నీ తీర్చేశాడు. ఖరీదైన కార్లు, విలాసవంతమైన ఫిషింగ్ బోట్, లగ్జరీ హోటళ్లలో బస చేయడం, స్ట్రిప్ క్లబ్ ల వెంట తిరగడం, మందు, విందు, చిందు, శారీరక సుఖం కొనుక్కోవడం వంటి కోరికలన్నీ తీర్చుకున్నాడు. విచ్చలవిడి జీవనం కోసం సుమారు 19,88,535.25 డాలర్ల డబ్బును రెండేళ్లలో ఖర్చుచేశాడు. అతని విచ్చలవిడి జీవితాన్ని చూసిన చుట్టుపక్కల వాళ్లు, డ్రగ్ డీలింగ్స్‌లో సంపాదిస్తున్నాడనీ, గ్యాంగ్ స్టర్ అనీ అనుకోవడం మొదలుపెట్టారు. అయినా అతనిని అడగడం కానీ, పోలీసులకు సమాచారం ఇవ్వడం కానీ చేయలేదు. దీంతో లూక్ పండగ చేసుకున్నాడు. అయితే, ఎవరో ఇచ్చిన సమాచారంతో, 2012 డిసెంబర్ లో న్యూ సౌత్ వేల్స్ లోని అతని నివాసంపై దాడి చేసిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం మోసపూరితంగా ఆర్థిక సాయం పొందినందుకు, తెలిసీ నేరపూరితంగా వ్యవహరించినందుకు సిడ్నీ జిల్లా కోర్టు అతడికి రెండేళ్ల మూడు నెలలు జైలు శిక్ష విధించింది. దీంతో ఆరు నెలల జైలు జీవితం తరువాత బెయిల్ పై విడుదలయ్యాడు. తరువాత న్యూ సౌత్ వేల్స్ క్రిమినల్ కోర్టు ఆఫ్ అప్పీల్ ను ఆశ్రయించాడు. దీంతో విచారించిన న్యూసౌత్ వేల్స్ క్రిమినల్ కోర్టు అతను చేసింది తప్పు అని చెబుతూ, నైతిక తప్పులకు శిక్ష విధించే అవకాశం లేదని పేర్కొంటూ 2016 డిసెంబర్ లో కేసును కొట్టేశారు. దీనిపై లూక్ మాట్లాడుతూ, ఇలా అనైతికంగా అకస్మాత్తుగా వచ్చిన డబ్బుతో వచ్చిన జీవితం అంత ఆనందంగా లేదని, ఒక రకంగా తన జీవితాన్ని నాశనం చేసిందని చెబుతున్నాడు. చెడు అలవాట్లు, చెడు సావాసాలు.. ఒకటేమిటి, ఆ డబ్బు వల్ల ఒక్క మంచి కూడా జరగలేదని చెబుతున్నాడు. లా చదువుతున్నానని, క్రిమినల్ లాయర్ అవుతానని లూక్ చెబుతున్నాడు.