: 'జీతంలో కోత లేదు....ఎన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు సెలవు తీసుకోండి' అంటూ ఆఫర్ ఇస్తున్న యజమాని!
'జీతంలో కోతలేదు, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సెలవు తీసుకోండి' అని ఏ యజమాని అయినా చెబుతాడా? చెప్పడు కదా? కానీ జర్మనీలోని 'మై హోటల్ షాప్' అనే హోటల్ బ్రోకింగ్ కంపెనీ యజమాని ఉర్లిచ్ క్యాస్ట్ నర్ మాత్రం తన వద్ద పనిచేసే ఉద్యోగులకు అలాంటి ఆఫర్ ఇచ్చి ఆసక్తి రేపుతున్నాడు. ఈయన నడిపే మై హోటల్ షాప్ కంపెనీలో 37 మంది పని చేస్తున్నారు. క్రిస్మస్ ను పురస్కరించుకుని మీటింగ్ పెట్టిన ఉర్లిచ్, ఉద్యోగులనుద్దేశించి మాట్లాడుతూ, 'ఏడాదిలో ఒకేసారి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సెలవులు తీసుకోండి... హాలిడే ట్రిప్ కు వెళ్లండి.. ఎంజాయ్ చేయండి. మీరు పెట్టిన సెలవుకు జీతంలో కోత ఉండదు' అని ప్రకటించాడు.
దీంతో సంస్థ ఉద్యోగులు ఎగిరి గంతేస్తున్నారు. దీనిపై ఓ ఉద్యోగి మాట్లాడుతూ, మూడున్నర వారాలపాటు సెలవులు తీసుకున్నానని, కుటుంబంతో ఎంతో ఎంజాయ్ చేశానని అన్నారు. దీనిపై ఉర్లిచ్ మాట్లాడుతూ, నిబంధనలకు లోబడి పనిచేయడం కంటే లక్ష్యం కోసం పనిచేయడాన్ని తాను ఇష్టపడతానని, అందుకే ఉద్యోగులకు ఇలాంటి ఆఫర్ ఇచ్చానని, సెలవులు ఎంజాయ్ చేసిన తరువాత ఉద్యోగులు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారని ఆయన తెలిపారు. తన ఉద్యోగులు కూడా సెలవులు ఎంజాయ్ చేసి, అలాగే పని చేస్తున్నారని ఆయన తెలిపారు.