: జగన్ డ్రామాలు చూస్తుంటే నవ్వొస్తోంది!: ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు
'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి నిరోధకుడు జగన్' అంటూ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. అందుకే రాష్ట్ర సంక్షేమానికి అడుగడుగునా అడ్డు తగులుతున్నారని అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యల పట్ల జగన్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అనేక మార్గాలున్నాయని చెప్పారు.
జగన్ డ్రామాలను చూస్తుంటే తనకు నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని ఏనాడూ ఆలోచించలేదని... ఇప్పుడు రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు చంద్రబాబు యత్నిస్తుంటే, జగన్ అడ్డుతగులుతున్నారని విమర్శించారు. జగన్ అవినీతి, అక్రమాలు, అరాచకాలను అసెంబ్లీలో ప్రజలకు వివరిస్తామని చెప్పారు.