kcr: 2013 భూ సేకరణ చట్టానికి తాడు, బొంగరం లేదు: శాసనసభలో సీఎం కేసీఆర్
తెలంగాణ శాసనసభలో భూసేకరణ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలపై, నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 భూ సేకరణ చట్టాన్ని బాధ్యతారహితంగా తీసుకొచ్చారని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆ చట్టానికి తాడు, బొంగరం లేవని విమర్శించారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే గోదావరిలో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవచ్చని చెప్పారు. మల్లన్నసాగర్ పేరుతో భూసేకరణ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే అవసరం ప్రభుత్వానికి లేదని చెప్పారు. ఎన్నికల తరువాత ఎలాగూ అధికారంలో ఉండమని భావించే కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి చట్టం తీసుకువచ్చిందని అన్నారు.
చరిత్రలో ఎప్పుడూ ఎవ్వరికీ ఇవ్వని పరిహారం 123 జీవోతో తాము ఇవ్వాలని అనుకున్నామని కేసీఆర్ అన్నారు. ఇటువంటి చట్టం తీసుకువచ్చే అధికారం రాష్ట్రానికి ఉందని చెప్పారు. రాజస్థాన్, గుజరాత్‌లలోనూ ఇటువంటి జీవో తీసుకొచ్చారని చెప్పారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు తన ఇంటి కోసం కట్టుకోవట్లేదని.. రైతుల కష్టాలను తీర్చడానికే కడుతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష నేతల మాటలు నమ్మకూడదని, వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. గతంలో కాంగ్రెస్ ఎకరాకు రూ.80 వేలకు మించి పరిహారం ఇవ్వలేదని ఆయన చెప్పారు.