kcr: ఇక్కడే.. మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఇవ్వను పో అన్నారు!: అసెంబ్లీలో సీఎం కేసీఆర్
తెలంగాణ శాసనసభలో భూసేకరణ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టి తెలంగాణ రైతుల కష్టాలను తీర్చాలనుకుంటున్న తమ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇక్కడే కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను పో అని ఈటల రాజేందర్ ను ఉద్దేశించి అన్నారని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణకు ఒక్కరూపాయి కూడా ఇవ్వనని అన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ నేతలు ఏమీ మాట్లాడలేదని, ఇప్పుడు తెలంగాణకు తాము మంచి చేస్తుంటే మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన అన్నారు.
ఆంధ్రా నాయకులు అటువంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టే, తెలంగాణ కోసం ప్రజలు పోరాడారని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చినందుకు తమకు గర్వంలేదని కేసీఆర్ అన్నారు. మల్లన్న సాగర్‌కు ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే ఎంతో లాభం కలుగుతుందని అన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులను ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొడుతున్నాయని ఆయన అన్నారు. ఉత్తర తెలంగాణలో ఎన్నో కరవు ప్రాంతాలు ఉన్నాయని, ప్రాజెక్టులు పూర్తయితే వాటన్నింటికీ నీళ్లు అందుతాయని ఆయన అన్నారు.