: ప్రజల్లో భయం పుట్టిస్తున్న మోదీ చర్యలు: రాహుల్ గాంధీ
నరేంద్ర మోదీ చర్యలు ప్రజల్లో భయం పుట్టిస్తున్నాయని, నోట్ల రద్దే అందుకు ఉదాహరణని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ 132వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మోదీ తానేం చేయాలనుకుంటే అది చేసుకుంటూ వెళుతున్నారని, ప్రజల ఉద్దేశాలను, అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని, ప్రజల బాగోగుల గురించి ఆలోచించేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు.
"ప్రజలపై ఎటువంటి నిర్ణయాలను ఆయన రుద్దుతున్నారో అందరమూ చూశాం. దేశ ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. ప్రజలపై ఇంత కఠిన నిబంధనలు ఎందుకు? ఆయన భయాన్ని మరింతగా పెంచాలని కోరుకుంటున్నట్టు ఉంది" అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. సహారా డైరీల్లో మోదీ పేరుందని మరోసారి గుర్తు చేసిన ఆయన, సహారాతో పాటు బిర్లా గ్రూప్ కంపెనీల నుంచి స్వాధీనం చేసుకున్న డైరీల్లోని వివరాల ప్రకారం మోదీ లంచాలు తీసుకున్నట్టు స్పష్టమవుతోందని ఆరోపించారు.