: 8 అడుగుల లోతైన గోతిలో బాలికను వుంచి రాక్షసత్వం... పెళ్లికి అంగీకరించలేదని అరాచకం!
15 సంవత్సరాల వయసున్న బాలికను ప్రేమించిన 19 ఏళ్ల యువకుడు, వివాహానికి అంగీకరించలేదని, ఆమెను కిడ్నాప్ చేయడంతో పాటు మూడు వారాల పాటు నకరం చూపాడు. గుజరాత్ లోని మోర్బి జిల్లా పరిధిలోని కొట్టానయిన గ్రామంలో జరిగిన ఈ ఘటన గురించిన మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించారు. నరేశ్ సోలంకి అనే యువకుడు, తన కులానికే చెందిన ఓ బాలికను పెళ్లి చేసుకోవాలని భావించాడు. అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించక పోయేసరికి, తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను కిడ్నాప్ చేశాడు.
తమ పొలంలో ఎనిమిది అడుగుల లోతున ఎనిమిది అడుగుల పొడవైన గొయ్యి తీశాడు. దానిలో బాలికను ఉంచి నిత్యమూ అత్యాచారం చేశాడు. ఈ రాక్షసత్వం మూడు వారాల పాటు సాగింది. బాలిక పైకి రాకుండా, చెక్కలను కప్పి ఉంచేవాడు. తమ కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు గాలింపు చేపడితే, బాలిక ఆచూకీ తెలిసింది. ఈ కేసులో నరేశ్ తో పాటు అతని తండ్రి, సోదరుడు, తాతయ్య సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.