: అరగంటపాటు నిలబడి కబుర్లు చెప్పుకున్న కేసీఆర్, చంద్రబాబు.. శ్రోతలా మారిన దత్తాత్రేయ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందులో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ విందుకు హాజరైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజ్భవన్లో కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకోవడం అందరినీ ఆకర్షించింది. వారి సంభాణషణకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ శ్రోతలా మారిపోయారు. అతిథులతో ఫొటోలు దిగే కార్యక్రమంలో రాష్ట్రపతి బిజీగా మారిపోతే ఆ సమయంలో కేసీఆర్, చంద్రబాబులు పక్కపక్కన నిలబడి 20 నిమిషాలపాటు వివిధ అంశాల గురించి మాట్లాడుకున్నారు.
ఆ సమయంలో ఏపీ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, కేంద్రమంత్రి సుజనా చౌదరి, తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జానారెడ్డి ఒకరి తర్వాత ఒకరుగా రావడంతో ముఖ్యమంత్రులు ఇద్దరూ రాజకీయాలను పక్కనపెట్టి మిగతా విషయాల గురించి మాట్లాడుకున్నారు. ముఖ్యంగా నోట్ల రద్దు గురించి చర్చించుకున్నట్టు సమాచారం. నోట్ల రద్దు నిర్ణయం మంచిదే అయినా ముందు కొంత కసరత్తు చేసి ఉంటే బాగుండేదని తాను మోదీని కలిసినప్పుడు చెప్పానని కేసీఆర్.. చంద్రబాబుకు వివరించారు.
దానికి ఆయన అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారని పేర్కొన్నారు. నిర్ణయం బయటకు లీక్ కాకూడదన్న ఉద్దేశంతోనే ఎవరికీ చెప్పకుండా చేయాల్సి వచ్చిందని ప్రధాని తనతో చెప్పారని కేసీఆర్ తెలిపారు. దీనికి తాను 'మీరు పులిమీద స్వారీ చేస్తున్నారని' అన్నానని చంద్రబాబుకు చెప్పారు. దీనికి ప్రధాని స్పందిస్తూ అన్నింటికీ సిద్ధపడే ఈ నిర్ణయం తీసుకున్నానని మోదీ తనతో చెప్పారని కేసీఆర్ వివరించారు.
నోట్ల రద్దు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఒకసారి డిజిటల్ లావాదేవీలు అలవాటైతే ప్రజలు ఇక అల్లుకుపోతారని ఈ సందర్భంగా చంద్రబాబు.. కేసీఆర్తో అన్నారు. రాష్ట్రంలో నగదు రహిత గ్రామాలను ఎంపిక చేసి వాటిని పెంచుకుంటూ పోతున్నామని, మరి మీరేం చేస్తున్నారని కేసీఆర్ను ప్రశ్నించారు. నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆదాయం కొంచెం తగ్గే అవకాశం ఉందని ఇద్దరు చంద్రులు అంగీకరించారు. ఈ సందర్భంగా ఇరురాష్ట్రాల మద్య నెలకొన్న సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నట్టు సమాచారం.