: ‘సంస్కృతం’లో పీజీ చేసి.. బంగారు పతకాలు సాధించిన విదేశీ యువతి!


జపాన్ దేశానికి చెందిన ఆ యువతి పేరు తొషికో ఇడవ. ఎనిమిది సంవత్సరాల క్రితం నేపాల్ రాజధాని ఖాట్మాండ్ లో నేపాలీ భాష ను నేర్చుకుంది. అయితే, ఆ భాషకు మూలం ‘సంస్కృతం’ అని తెలుసుకున్న ఆమెకు ఈ భాషపై ఆసక్తి కల్గింది. దీంతో, ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయంలో చేరింది.

మొదట ‘సంస్కృతం’లో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన ఆమె, ఆ తర్వాత శాస్త్రి (డిగ్రీ) కూడా పూర్తి చేసింది. ఈ రెండు కోర్సులు పూర్తి చేసిన ఉత్సాహంతో ఆచార్య (పీజీ) కోర్సులో చేరి విజయవంతంగా పూర్తి చేసింది. సాధారణ మార్కులతో కాకుండా, పీజీలో అద్భుత ప్రతిభ కనబరిచిన తొషికో ఇడవకు ఏకంగా ఐదు బంగారు పతకాలు లభించాయి. యూనివర్శిటీ వారు ఇచ్చే స్వర్ణ పతకంతో పాటు ప్రముఖుల పేర్లపై ఇచ్చే మరో నాలుగు బంగారు పతకాలు కూడా ఆమెకు దక్కాయి. ఈ సందర్భంగా తొషికో ఇడవ మాట్లాడుతూ, సంస్కృత పదాలను ఉచ్చరించేందుకు మొదట్లో తనకు బాగా కష్టమైందని, ఆ సమస్యను ప్రొఫెసర్ల సాయంతో అధిగమించానని చెప్పారు. సంస్కృత భాషాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తొషికో ఇడవ పేర్కొన్నారు.  

  • Loading...

More Telugu News