: రాష్ట్రానికి మరో రూ.212 కోట్లు రానున్నాయి: మంత్రి దేవినేని
ఏపీకి మరో రూ.212 కోట్లు రానున్నాయని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని ఏటీఎంలలోను నగదును అందుబాటులో ఉంచాలని ఆదేశించామన్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న ప్రాంతాల్లో కూలీలు, రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నగదు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించామని, అర్హులైన లబ్ధిదారులకు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘పోలవరం’ నిర్వాసితుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. నిర్వాసితులకు భూమికి బదులుగా భూమినే ఇస్తామని, ఏడు ముంపు మండలాల ప్రజలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని దేవినేని స్పష్టం చేశారు.