: కొత్త ట్విస్ట్... శశికళతో భేటీ అయిన హీరో అజిత్.. ఏం జరగనుంది?


తమిళనాడు రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతూ, దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీలో శూన్యం ఏర్పడింది. ఆమె నమ్మినబంటు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. మరోపక్క ఆమె నెచ్చెలి శశికళ... జయ స్థానంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం సంభవించింది. ప్రముఖ హీరో అజిత్ పోయెస్ గార్డెన్ లో శశికళతో భేటీ అయ్యారు. ఈ సమావేశాన్ని అన్నాడీఎంకే వర్గాలు ధ్రువీకరించాయి. పార్టీ పగ్గాలను తాను స్వీకరించే క్రమంలోనే, హీరో అజిత్ తో శశి సమావేశమైనట్టు తెలుస్తోంది. అయితే, శశికళతో సమావేశమైన విషయాన్ని అజిత్ మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు.

జయ ఆసుపత్రిలో చేరినప్పుడు అందరికన్నా ముందు ఆమెను పరామర్శించింది అజితే. అంతేకాదు, జయ చనిపోయిన రోజు బల్గేరియాలో సినిమా షూటింగ్ లో ఉన్నారు అజిత్. ఆమె మరణ వార్తను విన్న అజిత్... హుటాహుటీన చెన్నైలోని మెరీనా బీచ్ కు వచ్చి జయకు నివాళి అర్పించారు. జయలలితతో అజిత్ అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఆమె కూడా అజిత్ ను కుమారుడిగా భావించేవారట. ఈ నేపథ్యంలో, అమ్మ వారసుడిగా అజిత్ రాజకీయాల్లోకి వస్తారని కూడా కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో, శశికళతో అజిత్ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News