: అంతా బూటకపు వార్తలే.. ఈ ఏడాది సోషల్ మీడియాలో టాప్-10లో నిలిచిన ఫేక్ న్యూస్ లు ఇవిగో..!
నేటి కాలంలో ప్రతి ఒక్కరూ తమ దగ్గర ఉండాలని కోరుకునేది స్మార్ట్ ఫోన్. అరచేతిలో స్మార్ట్‌ఫోన్‌ని ఉంచుకొని తమ గ్రామ సమాచారం మొదలు అంతర్జాతీయ సమాచారాన్ని వెంటనే తెలుసుకోగలుగుతున్నారు. ఫేస్‌బుక్, వాట్సప్ లాంటి సోషల్ మీడియాలో గ్రూపులు క్రియేట్ చేసుకొని తమ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమాచారం మొదలు తన ఊరి సమాచారం, తమకు నచ్చిన వంటకాలు, సెలబ్రిటీల సమాచారం వరకు తెలుసుకుంటున్నారు. తమ అభిప్రాయాలను కూడా తెలుపుతూ ఆనందిస్తున్నారు.
అయితే, వాటి ద్వారా స్మార్ట్ ఫోన్ యూజర్లందరికీ వస్తోన్న సమాచారం అంతా నిజమైనదేనని చెప్పలేం. స్మార్ట్‌ఫోన్‌లలో సమాచారం క్షణాల్లో ఎలా వేగంగా అందుతుందో, ఫేక్ న్యూస్ కూడా అంతటి వేగంతోనూ ప్రచారం అవుతోంది. మంచి కన్నా చెడే వేగంగా ప్రచారం చెందుతుందన్న పెద్దల మాటలు సోషల్ మీడియాకు కూడా అతికినట్లు సరిపోతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన బూటకపు సమాచారంలో టాప్ టెన్‌లో నిలిచినవి ఏంటో తెలుసుకుందాం.
ఆ ఏడాది పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో వచ్చిన ఇటువంటి ఫేక్ కథనాల వల్ల భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కూడా స్పందించవలసి వచ్చింది. మరోవైపు యూనెస్కో వంటి ప్రఖ్యాత సంస్థలు కూడా పలు ఫేక్ న్యూస్‌ల పట్ల వివరణ ఇచ్చుకున్నాయి. ఇటువంటి న్యూస్ అధికంగా పాకే వేదికలయిన ఫేస్ బుక్, గూగుల్ లాంటి ప్రముఖ సంస్థలు కూడా వివరణలు ఇచ్చుకొని తమ సైట్లలో వ్యాప్తి చెందుతున్న వివిధ సమాచారం అంతా బూటకమని తేల్చిచెప్పాయి. మనదేశంలో వాట్సాప్ కు 16 కోట్లమంది యాక్టివ్ యూజర్లు ఉండగా, ఫేస్ బుక్ ను 14.8 కోట్లమంది, ట్విట్టర్ ను 2.2 కోట్లమంది వినియోగిస్తున్నారు.
ఈ ఏడాది మన సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టిన టాప్ 10 ఫేక్ కథనాలను చూస్తే విపరీతంగా చక్కర్లు కొట్టిన బూటకపు న్యూస్‌లో మోదీకి బెస్ట్ పీఎంగా యూనెస్కో పురస్కారం అందిందన్న సమాచారం అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత ప్రపంచంలోనే ఉత్తమ జాతీయగీతంగా 'జనగణమన'ను యూనెస్కో ప్రకటించిందంటూ ఈ ఏడాది ఆగస్టు 15 సందర్భంగా అనేక ఫేక్ వార్తలు వచ్చాయి. ఇక ప్రపంచంలోనే ఉత్తమ కరెన్సీగా రూ. 2000 నోటును యూనెస్కో ప్రకటించిందంటూ పలు ఫేక్ న్యూస్‌లు చక్కర్లు కొట్టాయి.
ఆ తరువాత వరుసగా టాప్ ప్లేస్‌లో నిలిచిన ‘ఫేక్ న్యూస్’లు ఇవిగో..
* దేశంలో తీసుకొచ్చిన కొత్త నోట్లలో జీపీఎస్ చిప్ పెట్టారు.. దీంతో నల్లధనానికి చెక్ పెట్టనున్నారు.
* కొత్త నోట్లలో రేడియో యాక్టివ్ ఇంక్.. దీని వల్ల కొత్త నోట్లను పెద్దమొత్తంలో దాచుకుంటే ఐటీ అధికారులు పట్టేస్తారు.
* మహిళలు తమ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్లు తొలగించాలి: ఢిల్లీ పోలీసు కమిషనర్ సూచన
* పది రూపాయల నాణేలను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దుచేసింది.
* తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఓ కూతురు ఉంది.
* నోట్ల రద్దు తర్వాత ఉప్పు కొరత ఏర్పడింది.. ఉప్పుధరలు విపరీతంగా పెరిగిపోనున్నాయ్.
* నెహ్రూ ప్రభుత్వం మర్రిచెట్టులా నిలిచింది: బీబీసీ ఇండియా మాజీ బ్యూరో చీఫ్ మార్క్ టుల్లీ.
ఈ పై వదంతులన్నీ ఈ ఏడాది టాప్ ప్లేస్‌లో నిలిచాయి. సోషల్ మీడియాలో వస్తోన్న ఫేస్ న్యూస్ పట్ల తస్మాత్ జాగ్రత్త. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకున్న తర్వాతే ఆయా న్యూస్‌లపై స్పందించండి. సోషల్ మీడియాలో న్యూస్ వచ్చీ రాగానే వాటిని షేర్ చేసి కష్టాలు కొనితెచ్చుకోకండి!