: ప్లే స్కూలుకు వెళ్లి పేటీఎం గురించి నేర్చుకో!: రాహుల్ కు బీజేపీ తాజా సలహా
నగదు చెల్లింపు మాధ్యమ సంస్థ పేటీఎం అంటే 'పే టూ మోదీ' అని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ విరుచుకుపడింది. పేటీఎం గురించి తెలుసుకోవాలని అనుకుంటే, ఆయన ప్లే స్కూలుకు వెళ్లి పాఠాలు నేర్చుకోవాలని బీజేపీ నేత రాహుల్ సిన్హా సలహా ఇచ్చారు.. నోట్ల రద్దు తరువాత రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించిన ఆయనపై విరుచుకుపడుతూ, పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల గణాంకాలను చూసి, తెలుసుకుని ఆపై బీజేపీ గురించి మాట్లాడాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మేలు కోసం ఒక్క పని కూడా చేయలేదని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏ అంశాలూ లేకనే నోట్ల రద్దును పట్టుకుని ఆయన వెళ్లాడుతున్నారని విమర్శించారు. ఆయన విమర్శలు కేవలం ప్రకటనలకే పరిమితమని, మీడియా తమ పేపర్లలో రాసుకోవడానికి తప్ప, ప్రజలు వాటిని పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు.