: జయలలిత బతికి ఉంటే నా ఆఫీసు, నివాసంలో అడుగుపెట్టే ధైర్యం ఎవరైనా చేసి ఉండేవారా?: తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు
తనపై దాడులను ఖండించిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, డీఎంకే ఎంపీ వీరమ్ కు ధన్యవాదాలని తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు తెలిపారు. తన ఇంట్లో దొరికిన వాటికి అన్నిటికీ ఆధారాలు ఉన్నాయని వాటిని మీడియాకు అందజేస్తున్నానని అన్నారు. తనను హౌస్ అరెస్టు చేశారని ఆరోపించారు. తనకు ట్రాన్సఫర్ ఆర్డర్స్ ఇచ్చే ధైర్యం కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోయిందని ఆయన చెప్పారు. తాను ఇఫ్పటికీ తమిళనాడు చీఫ్ సెక్రటరీనేనని అన్నారు. సెర్చ్ వారెంట్ లో తన పేరు లేదని అన్నారు. తన ఇంట్లో 1,12,320 రూపాయలు పట్టుకున్నారని ఆయన తెలిపారు. తన కుమార్తె, భార్యలకు చెందిన 40 తులాల బంగారం, 25 కేజీల దేవుళ్ల విగ్రహాలు మాత్రం తీసుకున్నారని అన్నారు.
దాడులు చేసి తన హక్కులకు భంగం కలిగించారని ఆయన ఆరోపించారు. తనను పురచ్చితలైవి జయలలిత చీఫ్ సెక్రటరీగా నియమించారని చెప్పారు. ఆమె బతికి ఉంటే చీఫ్ సెక్రటరీ ఆఫీసు, నివాసంలో అడుగుపెట్టే ధైర్యం ఎవరైనా చేసి ఉండేవారా? అని ఆయన ప్రశ్నించారు. తన కుమారుడి పేరుతో సెర్చ్ వారెంట్ ఉంటే, తన నివాసం, ఆఫీసులను తనిఖీ చేసే అధికారం సీఆర్పీఎఫ్ కు ఎవరిచ్చారని అన్నారు. తన కుమారుడు విదేశాల్లో ఉంటాడని, తనతో ఉండడం లేదని ఆయన తెలిపారు. తనను బదిలీ చేసిన తరువాత తనిఖీలు నిర్వహించాల్సిందని ఆయన తెలిపారు. 32 ఏళ్ల పాటు సర్వీసు చేసిన తనకే ఇలా ఉంటే, సామాన్యుల పరిస్థితి ఏంటని అన్నారు. తాను శేఖరరెడ్డికి సంబంధించిన ఏ లావాదేవీలోనూ కల్పించుకోలేదని అన్నారు. తన కుమారుడికి అతనితో వ్యాపారలావాదేవీలు లేవని, విట్ నెస్ సైన్ మాత్రమే చేశాడని ఆయన తెలిపారు. అది కనీసం ష్యూరిటీ కూడా కాదని ఆయన తెలిపారు.