: దివాకర్ ట్రావెల్స్ అక్రమాలకు ఆధారాలు ఇవిగో!: నిప్పులు చెరిగిన శ్రీనివాసగౌడ్
తెలంగాణలో దివాకర్ ట్రావెల్స్ బస్సులు అక్రమంగా తిరుగుతున్నాయని చెబుతూ, అందుకు సంబంధించిన ఆధారాలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ మీడియాకు చూపారు. ఆయన బస్సుల్లో 45 మందికి పర్మిషన్ తీసుకుని 52 మంది ప్రయాణికులను తీసుకువెళుతున్నారని ఆరోపించారు. పాలెం వద్ద యాక్సిడెంట్ అయిన బస్సుకు సంబంధించి ఇంతవరకూ పరిహారం చెల్లించలేదని విమర్శించారు. ఆయన బస్సుల్లో తల నీలాలు వంటి గూడ్స్ సరఫరా సాగుతోందని, వివిధ వస్తు రవాణాకు బస్సులను వినియోగిస్తూ దివాకర్ బస్సులు పట్టుబడ్డాయని కాగితాలు చూపించారు. యాక్సిడెంట్ బస్సులను అంతకుముందే అమ్మేసినట్టు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారని ఆరోపించారు. 10-10-2010న బస్సును అమ్మేశానని చెబుతూ, 8-12-2010 తేదీ వున్న స్టాంపు పేపర్లపై రాసుకున్నారని ఆ దస్త్రాలు చూపారు. ప్రైవేటు ట్రావెల్స్ మూలంగానే తెలంగాణ ఆర్టీసీకి రోజుకు కోటి రూపాయల నష్టం వస్తోందని, వీటి ఆగడాలను అడ్డుకునే తీరుతామని స్పష్టం చేశారు.