: కోడి పందేలు కాదు... కోడి పుంజులే లేకుండా చేస్తాం!: గుంటూరు రూరల్ ఎస్పీ
సంక్రాంతి వచ్చిందంటే కోస్తాంధ్ర జిల్లాల్లో ఉండే సందడే వేరు. దేశవిదేశాల్లో ఉన్న వారంతా తమ ఊళ్లకు చేరుకుని కోడి పందేల్లో లీనమైపోతారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా అనాదిగా వస్తున్న ఈ కోడిపందేలను ఎంజాయ్ చేస్తారు. ఈ నేపథ్యంలో, కోడిపందేలకు చెక్ పెట్టాల్సిందే అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో, పందెంరాయుళ్లపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది. గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ్ నాయక్ మాట్లాడుతూ, గతంలో కోడి పందేల కేసుల్లో ఉన్న వారందరినీ బైండోవర్ చేస్తామని చెప్పారు. ఈ రోజు నుంచే రూరల్ జిల్లా పరిధిలో పోలీసుల దాడులు కొనసాగుతాయని... సంక్రాంతి వరకు కోడి పుంజలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఇప్పటికే కోడి పందేల నిర్వాహకులు, కోడి పందేల్లో పాల్గొనే వారి వివరాలను సేకరిస్తున్నట్టు చెప్పారు. కోడి పందేలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని... తమ మాటను బేఖాతరు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు గుంటూరు అర్బన్ ఎస్పీ త్రిపాఠీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, పేకాట ఆడేవారిని ఉపేక్షించబోమని చెప్పారు. తమ మాట వినని వారంతా సంక్రాంతి రోజున జైల్లోనే ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు. కోడి పందేలకు కత్తులు తయారు చేసేవారు, కత్తులు కట్టేవారి వివరాలన్నీ తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికే రాజకీయ నేతలను కూడా హెచ్చరించామని తెలిపారు.