: నాకే అవకాశం ఉంటే... ట్రంప్ అడ్రస్ లేకుండా పోయేవాడు: ఒబామా
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ పై అధ్యక్షుడు ఒబామా మరోసారి స్పందించారు. ఇప్పటికే అధ్యక్షుడిగా రెండు సార్లు విజయం సాధించిన తనకు, మరోసారి పోటీ చేయడానికి అవకాశం లేదని... మూడోసారి పోటీ చేసే అవకాశమే ఉంటే, ట్రంప్ గెలవడం అసంభవమని అన్నారు. అధ్యక్షుడిగా తాను తీసుకున్న నిర్ణయాల పట్ల అమెరికన్లు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఎఫ్బీఐ స్టేట్ మెంట్ వెల్లడికావడం వల్లే తమ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఓటమిపాలు అయ్యారని చెప్పారు. అమెరికా ప్రజలకు సేవ చేయడమే తాను, తన భార్య మిచెల్లీ పొందిన అత్యంత విలువైన బహుమతి అని తెలిపారు.
మరోవైపు ఒబామా వ్యాఖ్యలపై డొనాల్డ్ ట్రంప్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించారు. ఒబామా అలాగే చెబుతారని... ఒకవేళ మూడో సారి పోటీ చేసే అవకాశం ఉంటే కూడా, ఒబామా గెలిచే అవకాశం ఎంతమాత్రం లేదని కొట్టిపారేశారు. ఒబామా హయాంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం, నిరుద్యోగం వంటి పలు సమస్యలు తలెత్తాయని చెప్పారు.