: కేర‌ళ‌కు చెందిన ఆ మూడు కంపెనీల్లో బంగారం ఎంతుందో తెలిస్తే షాకే!.. ప్ర‌పంచంలోని చాలా ధ‌నిక దేశాల కంటే ఎంతో ఎక్కువ‌!


కేర‌ళ‌లోని మూడు కంపెనీల్లో ఉన్న బంగారం మొత్తం ఎంతో తెలిస్తే ఆశ్చ‌ర్యం వేయ‌క‌మాన‌దు. ప్ర‌పంచంలోని కొన్ని ధ‌నిక దేశాల కంటే కూడా చాలా ఎక్కువ‌ ఇది. ఇంకా చెప్పాలంటే, ఆస్ట్రేలియా, సింగ‌పూర్‌, స్వీడ‌న్‌లో ఉన్న నిల్వ‌ల కంటే కూడా ఎక్కువే. అతిపెద్ద గోల్డ్‌లోన్ కంపెనీలుగా చెప్పుకునే ముత్తూట్ ఫైనాన్స్‌, మ‌ణ‌ప్పురం ఫైనాన్స్‌, ముత్తూట్ ఫిన్‌కార్ప్‌ల‌లో ఉన్న బంగారం నిల్వ‌లు ఈ ఏడాది సెప్టెంబ‌రు నాటికి 195 ట‌న్నుల నుంచి ఎకాఎకీన 263 ట‌న్నుల‌కు చేరుకున్నాయి.  

ప్ర‌పంచ‌వ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్‌లో దాదాపు 30 శాతం ఒక్క భార‌త్ నుంచే ఉంది. భార‌తీయుల‌కు ప‌సిడిపై ఉన్న మోజు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సామాజిక భ‌ద్ర‌త కింద ప్ర‌తి కుటుంబం కొంత బంగారాన్ని ఆభ‌ర‌ణాల రూపంలో ద‌గ్గ‌ర పెట్టుకోవ‌డం అనాదిగా వ‌స్తున్న‌దే. ఇక్క‌డ ఇంకా విచిత్ర‌మైన విష‌యం ఏంటంటే.. కేర‌ళ‌లో దాదాపు రెండు ల‌క్ష‌ల మంది బంగారం వ్యాపార రంగంలో ఉపాధి పొందుతుండ‌డం!

ఇక గ‌త రెండేళ్లుగా ముత్తూట్ ఫైనాన్స్‌లో బంగారం నిల్వ‌లు పెరుగుతూ వ‌స్తున్నాయి. 116 ట‌న్నుల నుంచి 150 ట‌న్నుల‌కు ప‌సిడి నిల్వ‌లు చేరుకున్నాయి. ఈ విష‌యంలో సింగ‌పూర్‌ (127.4 ట‌న్నులు), స్వీడ‌న్‌(125.7 ట‌న్నులు), ఆస్ట్రేలియా(79.9 ట‌న్నులు), కువైట్‌(79 ట‌న్నులు), డెన్మార్క్‌(66.5 ట‌న్నులు), ఫిన్లాండ్‌(49.1 ట‌న్నులు)లను ముత్తూట్ ఫైనాన్స్ వెన‌క్కి నెట్టేసింది. కేర‌ళకే చెందిన మ‌రో సంస్థ మ‌ణ‌ప్పురం ఫైనాన్స్ 65.9 ట‌న్నులు, ముత్తూట్ ఫిన్‌కార్ప్ వ‌ద్ద 46.88 ట‌న్నుల బంగారం నిల్వ‌లు ఉన్నాయి. ఈ మూడు కంపెనీల్లో ఉన్న మొత్తం బంగారం 262.78 ట‌న్నులు.

ఇక వ‌ర‌ల్డ్ గోల్డ్ కౌన్సిల్ గ‌ణాంకాల ప్ర‌కారం భార‌త్ 558 ట‌న్నుల బంగారం నిల్వ‌ల‌తో ప్ర‌పంచంలో 11వ స్థానాన్ని ఆక్ర‌మించింది. బంగారంపై అంత‌గా ఆస‌క్తి చూప‌ని అమెరికా వ‌ద్ద ఏకంగా 8,134 ట‌న్నుల బంగారం ఉండ‌గా ఆ త‌ర్వాత స్థానాల్లో జ‌ర్మ‌నీ(3,378 ట‌న్నులు), ఐఎంఎఫ్(2,814 ట‌న్నులు) నిలిచాయి. అయితే బంగారం వినియోగంలో మాత్రం భార‌త్ టాప్ ప్లేస్‌లో ఉన్న‌ట్టు జీఎఫ్ఎంఎస్ గోల్డ్ స‌ర్వే పేర్కొంది.

  • Loading...

More Telugu News