: నగదు రహితం.. ఇక సూపర్ ఫాస్ట్! రెండు రోజుల్లో ఏపీకి పదివేల ఈపాస్ యంత్రాలు
ఏపీలో ఇక నగదు రహిత లావాదేవీలు ఊపందుకోనున్నాయి. మరో రెండు రోజుల్లో రాష్ట్రానికి పదివేల ఈపాస్ యంత్రాలు రానున్నాయి. నెల రోజుల వ్యవధిలో మరో లక్షన్నర యంత్రాలు రానున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సోమవారం అధికారులు, బ్యాంకర్లతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను మరింత వేగవంతం చేసే చర్యల్లో భాగంగా మరో రెండు రోజుల్లో పదివేల ఈపాస్ యంత్రాలు వస్తున్నట్టు తెలిపారు.
రేషన్ దుకాణాలను వ్యాపార లావాదేవీలు జరిపే ప్రాంతాలుగా మార్చేందుకు బ్యాంకర్లు చర్యలు చేపట్టాలని కోరారు. సామాజిక భద్రత పింఛన్లను రెండు మూడు రోజుల్లో పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, ఆర్థిక, ప్రణాళిక, పౌరసంబంధాల శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి కన్వీనర్ రంగనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మొబైల్ లావాదేవీలు గణనీయంగా పెరిగినట్టు చంద్రబాబుకు వివరించారు. 13.82 శాతం ఉన్న లావాదేవీలు ప్రస్తుతం 16.62 శాతానికి చేరుకున్నాయని పేర్కొన్నారు.