: మోదీజీ నా అకౌంట్లోకి 100 కోట్లు వచ్చి పడ్డాయి...దీని సంగతి చూడండి: మహిళ
తన జన్ ధన్ బ్యాంకు ఖాతాలో 100 కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయని ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందిన శీతల్ యాదవ్ అనే మహిళ ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి మెయిల్ పంపింది. వివరాల్లోకి వెళ్తే...శీతల్ యాదవ్ అనే మహిళకు మీరట్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన బ్రాంచ్ లో జన్ ధన్ యోజన బ్యాంకు అకౌంట్ ఉంది. ఈ నెల 18న ఆమె డబ్బు డ్రా చేసుకునేందుకు ఐసీఐసీఐ ఏటీఎంకు వెళ్లారు. 2000 విత్ డ్రా చేసుకుంది. అయితే బ్యాలెన్స్ చూసిన ఆమెకు మతిపోయింది. తన అకౌంట్ లో 99,99,99,394 రూపాయల బ్యాలెన్స్ ఉందంటూ అందులో చూపించడంతో మరో ఏటీఎం వద్దకు వెళ్లి మళ్లీ బ్యాలెన్స్ చెక్ చేసింది.
దానిలో కూడా అలాగే రావడంతో తన కళ్లు తనను మోసం చేయడం లేదుకదా? అని భావించి, అక్కడే ఉన్న మరో వ్యక్తికి దానిని చూపించి, నిజమేనని ధ్రువీకరించుకుని ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లి బ్యాలెన్స్ మరోసారి చూసింది. అందులో కూడా అలాగే చూపడంతో నేరుగా తన భర్త వద్దకు వెళ్లి విషయం వివరించింది. ఆయన తన భార్యను వెంటబెట్టుకుని వెళ్లి ఫిర్యాదు చేయడంతో బ్యాంకు మేనేజర్ లేడని సిబ్బంది సమాధానం చెప్పారు. దీంతో మరుసటి రోజు బ్యాంకుకు వెళ్లగా ఈసారి వేరే కారణం చెప్పి మళ్లీ పంపేశారు. దీంతో వారు అక్కడే ఉన్న విద్యావంతుడుకి విషయం వివరించడంతో ఆయన పీఎంవోకు ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చాడు. దీంతో వారు పీఎంవోకు ఈమెయిల్ పంపినట్టు తెలిపారు.