: లెజెండే వెయ్యి రోజులు ఆడితే...మరి ఇదో?: చంద్రబాబు
లెంజెండ్ సినిమాయే వెయ్యి రోజులు ఆడితే...మరి ఈ గౌతమీపుత్ర శాతకర్ణి ఎన్నిరోజులు ఆడుతుంది? అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవ్వుతూ ప్రశ్నించారు. తిరుపతిలో జరిగిన గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తరువాత రాజధానికి అమరావతి పేరు పెట్టండి అంటూ రామోజీరావు ప్రతిపాదన పంపించారని అన్నారు. దీనికి ఎలాంటి వివాదం రాలేదని అన్నారు. తనకు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకి శాతవాహన శకం, శాలివాహన శకం తెలుసని అన్నారు. తెలుగు వారి కీర్తి ప్రతిష్ఠలను దిగంతాలకు వ్యాపింపజేసిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి అన్నారు.
అలాంటి చరిత్ర కలిగిన తెలుగువారు....తమిళనాడు నుంచి విడిపోయి గూడులేక మూడేళ్లు కర్నూలులో ఉన్నారన్నారు. తరువాత 60 ఏళ్లు తెలంగాణతో కలిసి ఉన్నామని గుర్తుచేసుకున్నారు. తరువాత వారు కలిసి ఉండలేమని అనడంతో ఇప్పుడు మళ్లీ గూడులేని వారమయ్యామని అన్నారు. అమరావతి అన్న తరువాత తాను లండన్ వెళ్లగా అక్కడ గౌతమీపుత్ర శాతకర్ణి గ్యాలరీ ఉందని అన్నారు. అప్పుడు ఆ గ్యాలరీ చూపించారని అన్నారు. దాని నుంచి ప్రేరణ తీసుకుని, దానిని పరిశోధించి సినిమాగా తీస్తున్నారంటే దానిని అభినందించాల్సిన అవసరం ఉందని అన్నారు.
రాజులెందరున్నా...గౌతమీపుత్ర శాతకర్ణి ప్రత్యేకమైన వ్యక్తి అన్నారు. అలాగే తల్లి లేదా మహిళకు గౌరవమివ్వాలని చరిత్రలో మొట్టమొదటి సారి తెలిపిన వ్యక్తి గౌతమీపుత్ర శాతకర్ణి అని అన్నారు. రాజ్యాలన్నీ ఓడించి, ఏకరాజ్యంగా దేశాన్ని ఏలిన వ్యక్తి తెలుగువాడైన, అమరావతిని రాజధాని చేసుకుని పాలించిన వ్యక్తి గౌతమీపుత్ర శాతకర్ణిని స్మరించుకోవడం ఎంతైనా ముదావహమని ఆయన చెప్పారు. అలాగే ఎన్టీఆర్ కూడా కాంగ్రెస్ తో పోరాడి, నాన్ కాంగ్రెస్ గవర్నమెంటును ఏర్పాటు చేసిన ఘనత ఆయనదేనని ఆయన అన్నారు. క్రీస్తు శకం వచ్చిన 70 ఏళ్ల తర్వాత శాతవాహన శకం ప్రారంభమైందని అన్నారు.
ప్రపంచదేశాల్లో ఉగాది జరుపుకుంటున్నాం...అదే శాతవాహన శకానికి గుర్తు అని ఆయన అన్నారు. బాలకృష్ణ సినీ ప్రస్థానం చూస్తే చాలా ఆసక్తికరమని అన్నారు. ఈ సినిమాలో నటించడం బాలకృష్ణ పూర్వజన్మ సుకృతమని చెప్పారు. ఈ సినిమా చూసి, అంతకు మించిన రాజధానిని నిర్మించాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన చెప్పారు. ఇలాంటి సమయంలో ఈ సినిమా తీయడం ఆనందకరమని చెప్పారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుగారు తొలిసారి ఆడియో వేడుకకు వచ్చారని ఆయన తెలిపారు.
ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు 1950 కోట్ల చెక్కును కేంద్రం ఈ రోజు ఇచ్చిందని అన్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి వెయ్యి రోజుల కంటే ఎంతో ఎక్కువ కాలం ఆడుతుందని అన్నారు. హేమమాలిని, బాలకృష్ణ తల్లిగా నటించడం గొప్పవిషయమని అన్నారు. ఈ సినిమాను క్రిష్ గొప్పగా తీశారని బాబు తెలిపారు. ఈ సినిమాకు మంచి టీం పని చేసిందని ఆయన చెప్పారు. వారందరికీ శుభాబినందనలని ఆయన తెలిపారు. ఈ సినిమా చూసి తెలుగు జాతి చరిత్ర తెలుసుకోవాలని అన్నారు.