: ఆ తెగువ, ధైర్యం బాలయ్యకు, క్రిష్ కు మాత్రమే ఉన్నాయి: సిరివెన్నెల
'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా కథను చిత్రీకరించిన విధానం అద్భుతమని సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు పాలించిన ఐదు వంశాలూ తెలుగు వంశాలేనని అన్న ఆయన, అందులో చివరివాడే 'గౌతమీపుత్ర శాతకర్ణి' అని చెప్పారు. శాతవాహనులు పాలించిన 400 సంవత్సరాల్లో 25వ చక్రవర్తి 'గౌతమీపుత్ర శాతకర్ణి' అని తెలిపారు. జీవితంలో ఎలాంటి ఘటన చోటు చేసుకున్నా, అది తల్లివల్లేనని గుర్తించి, ఆమె పేరును పెట్టుకున్న గొప్ప చక్రవర్తి ఆయనేనని సిరివెన్నెల తెలిపారు.
32 మంది రాజులను జయించి, వారి ఖడ్గాలను సొంతం చేసుకుని, శాంతి ఖడ్గంగా మార్చిన మహానుబావుడు 'గౌతమీపుత్ర శాతకర్ణి' అని అన్నారు. ఇంత గొప్ప సినిమాను రూపొందించిన నిర్మాతల ధైర్యాన్ని మెచ్చుకోవాలని ఆయన అన్నారు. ఎంతో రిస్క్ తీసుకుని క్రిష్ ను నమ్మి ఈ ప్రాజెక్టు అప్పగించారని అన్నారు. ఈ సినిమా వల్ల తెలుగు వారిలో నిద్రాణమైఉన్న జాతి భక్తి జాగృతమవుతుందని చెప్పిన ఆయన, ఈ సినిమా విజయవంతమవుతుందన్న నమ్మకం ఉందని అన్నారు. ఈ సినిమా తీయగల ధైర్యం క్రిష్ కు మాత్రమే ఉంటే... ఈ పాత్రను చేయగల ధైర్యం ఒక్క బాలయ్యకు మాత్రమే ఉందని ఆయన అన్నారు.