: భారీ కుదుపుకు లోనైన దివీస్ షేర్లు!
ప్రముఖ ఫార్మా కంపెనీ దివీస్ 9000 కోట్ల రూపాయల మార్కెట్ వాల్యూ కోల్పోయింది. అమెరికాకి ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) పలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో నేటి మార్కెట్ లో దివీస్ లాబొరేటరీస్ షేరు దాదాపు 14 శాతం క్షీణించింది. దీంతో దివీస్ ఇండస్ట్రీ కేవలం రెండు రోజుల్లోనే 30 శాతానికి పైగా నష్టపోయింది. మార్కెట్ విలువలో దాదాపు 33 శాతం క్షీణించి 9,000 కోట్ల రూపాయలు కోల్పోయింది. కాగా, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అభ్యంతరాల గురించి వివరణ ఇవ్వాలని బీఎస్ఈ వివరణ కోరింది. దీంతో దివీస్ షేర్లను అమ్మేందుకు షేర్ హోల్డర్స్ మక్కువచూపారు. దీంతో వేల కోట్ల సంపద ఆవిరైపోయింది.
దివీస్ వైజాగ్ ప్లాంటుపై యూఎస్ఎఫ్‌డీఏ వివిధ లోపాలు నమోదు చేసిందని ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎమ్కే గ్లోబల్ పేర్కొంది. యాక్టివ్ ఫార్మా ఇన్ గ్రెడియంట్స్ (ఏపీఐలు) తయారీలో స్వచ్చత, నాణ్యత వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఆరోపించింది. ఉత్పత్తిలో లోపాలు కూడా ఉన్నాయని తెలిపింది. తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని పేర్కొంది. దివీస్ దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ షేర్ల అమ్మకాలు ఇప్పటికిప్పుడు తగ్గిపోయే అవకాశం లేదని, దీంతో ఈ షేర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొందని ఏంజెల్ బ్రోకింగ్ సంస్థ టెక్నికల్ ఎనలిస్ట్ రుచిత్ జైన్ తెలిపారు.