: దయచేసి మీ ట్వీట్లలో నా భార్య పేరును ప్రస్తావించకండి!: రవిచంద్రన్ అశ్విన్
బంతితో పాటు బ్యాటుతో కూడా దుమ్మురేపుతూ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకున్న టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త సమస్యలో చిక్కుకున్నాడు. తాను అవార్డుకు ఎంపిక కావడానికి టెస్ట్ కెప్టెన్ కోహ్లీ, కోచ్ కుంబ్లే, తన భార్య ప్రీతిలు కారణమని అశ్విన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో ధోనీ పేరును పేర్కొనకపోవడంతో... ధోనీ అభిమానులు అశ్విన్ పై మండిపడ్డారు. నీ అభ్యున్నతికి కారణమైన ధోనీ పేరును ఎందుకు మర్చిపోయావని ప్రశ్నించారు. దీంతో ఈ వివాదానికి ముగింపు పలికేందుకు అశ్విన్ సిద్ధమయ్యాడు.
తన ఉన్నతికి ధోనీ ఎంతో కృషి చేశాడన్న విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని... ధోనీ తర్వాత కోహ్లీ టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలను స్వీకరించాడని... అందుకే ఇప్పటి జట్టును ఉద్దేశించి మాత్రమే తాను ట్వీట్ చేశానని చెప్పాడు. ఎవరైనా ఏదైనా సాధించినప్పుడు... ముందుగా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారని... అందుకే తన భార్య పేరును పేర్కొన్నానని తెలిపాడు. ఫన్నీగా చేసే ట్వీట్లలో తన భార్య ప్రీతి ట్యాగ్ ను పేర్కొనవద్దని నెటిజన్లను కోరాడు.