: ఆ విషయం బీజేపీకి స్పష్టంగా తెలుసు: మాయావతి
భారత ప్రధాని మోదీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇద్దరూ దొందూ దొందేనని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. ములాయం మాదిరిగానే మోదీ కూడా అబద్ధాలు చెబుతూ, అసత్యపు మాటలు ప్రచారం చేసి, తప్పుడు హామీలు ఇచ్చారని విమర్శించారు. మోదీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా ఉత్తరప్రదేశ్ లో అమలు కాలేదని తెలిపారు. మోదీ వ్యవహారశైలి పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేమనే సంగతి బీజేపీ నేతలకు స్పష్టంగా తెలుసని చెప్పారు. కాంగ్రెస్-ఎస్పీల పొత్తుపై కూడా మాయావతి మండిపడ్డారు. బీజేపీ ఆమోదం పొందిన తర్వాతే ఆ రెండు పార్టీల కార్యాచరణ మొదలవుతుందని ఆమె ఎద్దేవా చేశారు. బీజేపీకి మేలు చేయడానికే ఆ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడతాయని విమర్శించారు.