: అరుణ్ జైట్లీ విఫలమయ్యారు.. రాజీనామా చేయాల్సిందే : ఎంపీ కీర్తి ఆజాద్
పెద్దనోట్ల రద్దు తదనంతర పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీపై బీజేపీ బహిష్కృత నేత, ఎంపీ కీర్తి ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జైట్లీ ఓ అసమర్థుడని ఆయన వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా సామాన్యులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని, వారి కష్టాల పట్ల బాధ్యత వహిస్తూ జైట్లీ రాజీనామా చేయాలని కీర్తి ఆజాద్ డిమాండ్ చేశారు. కేంద్ర సర్కారుకి జైట్లీ చెడ్డపేరు తెస్తున్నారని, ఆయన ఓ ఆర్థికవేత్త కూడా కాదని ఆయన అన్నారు. మరోవైపు బ్యాంకర్లపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం దేశంలోని బ్యాంకులు నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చడంలోనే బిజీబిజీగా ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. బ్యాంకులు కూడా ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోకే వస్తాయని, అందుకే బ్యాంకుల్లో కొనసాగుతున్న అక్రమాలకు బాధ్యత వహిస్తూ జైట్లీ రాజీనామా చేయాలని ఆయన అన్నారు.