: మద్యం మత్తులో అతిథిని చితక్కొట్టిన అందాల భామ... కటకటాల వెనక్కు!
వానెస్సా బార్సెలో... 2017 సంవత్సరానికి మిస్ మియామీ లేక్స్ గా ఎన్నికైన అందాల భామ. తన ఇంట్లో ఓ పార్టీ పెట్టి, పూటుగా మద్యం సేవించి, ఓ అతిథితో గొడవపడి, అతన్ని చితక్కొట్టి అరెస్టైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, హైలేహ్ అపార్టుమెంటులోని తన ఇంట్లో పెద్ద పార్టీని ఏర్పాటు చేసిన వానెస్సా, చాలా మందినే ఆహ్వానించింది. ఆపై ఓ అతిథితో గొడవ పెట్టుకుంది. అతన్ని బయటకు వెళ్లిపోవాలని చెబుతూ, అల్యూమినియం బేస్ బాల్ బ్యాట్ తీసుకుని దాడికి దిగింది. భుజాలపైన, వీపుపైన కొట్టింది. ఆమె అనుచరులు సైతం అతన్ని మెట్లపై నుంచి తోసేశారు. ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడగా, అతడిని ఆసుపత్రికి తరలించారు. అతని ఎడమ కన్ను తీవ్రంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. కాగా, ఘటనపై వానెస్సా స్పందిస్తూ, తన తప్పేమీ లేదని, విచారణలో నిజం తెలుస్తుందని వెల్లడించడం గమనార్హం.