: ‘గూటం’ అనుకుని ‘గ్రెనేడ్’ తో వక్కలు దంచాడు... తెలిసి షాక్ అయ్యాడు!
అది చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్. ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంకాంగ్. ఇరవై ఐదేళ్లుగా వక్కలు దంచుకోవడానికి ఒక గూటం మాదిరి ఉండే వస్తువును ఉపయోగిస్తున్నాడు. అయితే తాజాగా తెలిసిన సమాచారంతో అంకాంగ్ కంగుతిన్నాడు. ఎందుకంటే, వక్కలు దంచేందుకు వాడుతున్న ఆ గూటం.. గూటం కాదని అది గ్రెనేడ్ అని తెలియడంతో షాక్ తిన్నాడు. 1991లో అంకాంగ్ కు తన మిత్రుడొకరు ఈ గూటాన్ని బహుమతిగా ఇచ్చాడు. అప్పటి నుంచి దీంతో, వక్కలు దంచుకుంటున్నాడు.
అయితే, షాంగ్సీ ప్రావిన్స్ కు చెందిన పోలీసులు గ్రెనేడ్ ల గురించి తెలియజేసే కరపత్రాలను ఇటీవల పంచారు. ఆ కరపత్రాలలో ఒకటి అంకాంగ్ కు చేరింది. అందులో సమాచారాన్ని పూర్తిగా చదివిన అంకాంగ్ కు అసలు విషయం అర్థమైంది. ఇన్నాళ్లుగా తన వద్ద ఉన్న ‘గూటం’.. గ్రెనేడ్ అని. వెంటనే, దానిని తీసుకువెళ్లి, స్థానిక పోలీసులకు అప్పగించాడు. దీనిని పరిశీలించిన పోలీసులు, దానిని గ్రెనేడ్ గా నిర్థారించారు. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ గ్రెనేడ్ ఇంకా యాక్టివ్ గానే ఉండటం. ఒకవేళ వక్కలు దంచేటప్పుడు కనుక మరింత బలంగా దానిని వాడినా, పని అయిపోగానే పక్కకు విసిరేసినా ఈపాటికి అది ఎప్పుడో పేలిపోయి ఉండేదని పోలీసులు చెప్పారు.