: తలచుకుంటేనే ఒళ్లు జలదరించే పన్నెండేళ్ల నాటి ఘటన... గుర్తు చేసుకుంటున్న ప్రజలు!
సరిగ్గా పన్నెండేళ్ల క్రితం... 2004 డిసెంబర్ 26న సముద్రుడు తన ఆగ్రహాన్ని భూమాతపై చూపిన వేళ, సునామీ రూపంలో ఉవ్వెత్తున ఎగసి పడుతూ వచ్చిన రాకాసి అలలు వేలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. సమత్రా దీవుల్లో వచ్చిన భూకంపంతో మహా సముద్రాలు అల్లకల్లోలం కాగా, ఆ ప్రభావం 40 దేశాలపై కనిపించింది. ఇండియాలో తమిళనాడు తీర ప్రాంతం అతలాకుతలం కాగా, నాగపట్నం, చెన్నై, కడలూరు, వేలాంకణి, పూంపుహార్ వంటి ప్రాంతాల్లో నిమిషాల వ్యవధిలో దాదాపు 8 వేల మంది మరణించారు. నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ, వేలాది మంది నేడు ఆనాటి మృతులకు నివాళులు అర్పించారు. సముద్రుడు మరెప్పుడు అంతటి ఉగ్రరూపాన్ని చూపరాదని కోరుతూ పలు ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, పాలు, పండ్లను సమర్పించారు. ఆనాటి సునామీని గుర్తు చేసుకున్నారు.