: మాదకద్రవ్యాలు అతిగా తీసుకుని మరణించిన తల్లిదండ్రులు... నాలుగు రోజుల నరకం తరువాత లోకాన్ని వీడిన ఐదు నెలల చిన్నారి
హెరాయిన్ ను అతిగా తీసుకున్న ఓ యువ జంట తమ అపార్టుమెంట్ లో విగత జీవులుగా మారగా, వారి ఐదు నెలల బిడ్డ నాలుగు రోజుల అనంతరం అదే అపార్టుమెంట్ లో ప్రాణాలు విడిచిన హృదయ విదారక ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగింది. ఎవరూ చూడక పోవడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, జాసన్ చాంబర్స్ (27), చెల్సియా కార్డారో (19)లు పిట్స్ బర్గ్ కు 60 కిలోమీటర్ల దూరంలోని జాన్స్ టౌన్ లోని కెర్న్ విల్లీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వారికి ఐదు నెలల పాప ఉంది.
వీరిద్దరూ హెరాయిన్ ను అతిగా తీసుకోవడంతో అది వ్యతిరేక ప్రభావం చూపించగా, నిమిషాల వ్యవధిలోనే మరణించారు. వారి ఇంట్లోని మొదటి ఫ్లోర్ లో చాంబర్స్ మృతదేహం, రెండో ఫ్లోర్ లోని బాత్ రూములో కార్డారో మృతదేహం పడివున్నాయి. వీరి మృతి తరువాత మూడు నాలుగు రోజుల పాటు పాప జీవించే ఉండవచ్చని, ఆకలితో ఏడ్చి ఏడ్చి బాలిక మరణించిందని, పాప మృతదేహాన్ని రెండో ఫ్లోర్ లోని బెడ్ రూములో కనుగొన్నామని జాన్స్ టౌన్ పోలీస్ కెప్టెన్ చాడ్ మిల్లర్ వెల్లడించారు. వీరిద్దరూ తమ బిడ్డను బాగా చూసుకునే వారని తమ విచారణలో వెల్లడైందని, ఇంట్లో చిన్నారి కోసం ఎంతో ఆహారం ఉందని, పాప సంరక్షణ నిమిత్తం సకల సదుపాయాలు ఉన్నాయని, దురలవాటే ఈ కుటుంబాన్ని బలిగొందని తెలిపారు. కాగా, 2014లో అమెరికాలో హెరాయిన్ ఓవర్ డోస్ అయి దాదాపు 28 వేల మంది మరణించారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.