: ఎయిర్ ఏషియా సీఎఫ్ఓ ను ప్రశ్నించిన ఈడీ
మనుగడలో లేని కంపెనీల నుంచి రూ.22 కోట్ల మేరకు లావాదేవీలు జరిగాయని టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పందించింది. ఎయిర్ ఏషియా సంస్థ విదేశీ మారక ద్రవ్య చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించి రూ.22 కోట్ల లావాదేవీలు జరిపిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఏషియా సంస్థ సీఎఫ్ఓ అంకుర్ కన్నాను ఈడీ ప్రశ్నించింది. ఫెమా చట్టం కింద ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. అయితే, ఈ విషయమై ఎయిర్ ఏషియా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కాగా, ఈ కేసుకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇటీవల ఎయిర్ ఏషియాకు, దానిలోని కీలక అధికారులకు సమన్లు జారీ చేసింది. దర్యాప్తులో భాగంగా అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందులో భాగంగానే అంకుర్ కన్నాను ఈడీ ప్రశ్నించింది. రూ.12 కోట్ల మేరకు సొమ్మును సింగపూర్ లోని ఓ కంపెనీకి చెల్లించినట్లు ఎయిర్ ఏషియా చూపిస్తున్న లావాదేవీలపై ఈడీ దృష్టి పెట్టింది.