: ఆఫ్ఘాన్ తొలి మహిళా పైలట్ గా పేరు ప్రఖ్యాతులు... దీంతోపాటే కష్టాలు కూడా!
కెప్టెన్ నీలూఫర్ రహమానీ... మత ఛాందసవాదం అధికంగా ఉండే దేశాల్లో ఒకటైన ఆఫ్ఘనిస్థాన్ వైమానికదళంలో మొట్ట మొదటి మహిళా పైలట్ గా గుర్తింపు పొందింది. ఆఫ్ఘనిస్థాన్ లో పనిచేస్తున్న రోజుల్లో చంపేస్తామంటూ ఆమెకు తాలిబన్ల నుంచి హెచ్చరికలు వచ్చాయి. దీంతో, ఆమె అమెరికాకు మకాం మార్చింది. గత సంవత్సరం 'వాషింగ్టన్ ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్' అవార్డు కూడా ఆమెకు దక్కింది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, తాను ఇప్పటికీ మిలిటరీ పైలట్ గానే ఉండాలనుకుంటున్నట్టు చెప్పింది. అయితే, తన సొంత దేశం ఆఫ్ఘనిస్థాన్ లో మాత్రం కాదని తెలిపింది. అమెరికాలో ఆశ్రయం పొందేందుకు ఇప్పటికే ఆమె ఓ పిటిషన్ దాఖలు చేసింది. అమెరికన్ ఎయిర్ ఫోర్సులో ఆమె చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన సొంత దేశంలో పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడకపోగా... రోజురోజుకూ దిగజారుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.