: ఛాలెంజ్ ని స్వీకరించి గెలిచిన కోహ్లీ టీమ్
మీకు ఐస్ బకెట్, రైస్ బకెట్ ఛాలెంజ్ ల గురించి తెలుసుకదా? ఇప్పుడో కొత్త చాలెంజ్ వచ్చింది. అదే 'మానెక్విన్ చాలెంజ్'... పిల్లలు ఆటలాడుతూ 'స్టాచ్యూ' అనగానే ఎక్కడి వాళ్లక్కడ నిలబడి పోతారు. ఇటువంటిదే ఈ ఛాలెంజ్ కూడా. ఈ ఛాలెంజ్ ని స్వీకరించింది కోహ్లీ టీమ్. 81 సెకన్ల పాటు స్టాచ్యూ అయిపోయింది. ఇంగ్లండ్ పై టెస్టు సిరీస్ గెలిచిన తరువాత, డ్రెస్సింగ్ రూములో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది స్టాచ్యూలా నిలుచుండిపోయారు.
ఎవరెలా ఫోజులు పెట్టారో తెలుసా? సిరీస్ గెలిచిన తరువాత ఇచ్చిన ట్రోఫీని ముద్దాడుతూ కోహ్లీ నిలబడిపోగా, ఇషాంత్ శర్మ సోఫాలో విగ్రహంలా ఉండిపోయాడు. కరుణ్ నాయర్ ను అభినందిస్తున్న పోజులో మనీష్ పాండే, తన బ్యాటును పరిశీలిస్తున్న పోజులో పుజారా ఉన్నారు. మిగతా వాళ్లు, సహాయ సిబ్బంది వివిధ రకాల పోజులు పెట్టి విగ్రహాల్లా మిగిలిపోయారు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికార వెబ్ సైట్లో అభిమానుల కోసం ఉంచింది.