: కొత్త సంవత్సరంలో నా కోరిక ఇదే: చంద్రబాబు
కొత్త సంవత్సరం ఆరంభంలోనే నగదు కష్టాలన్నీ తీరిపోవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలియజేశారు. 2017 ప్రజలను బ్యాంకుల నుంచి దూరం చేయాలని, ప్రతి ఒక్కరి వద్దా కనీస నగదు ఉండాలన్నదే తన వాంఛని తెలిపారు. ఈ ఉదయం బ్యాంకర్లు, కలెక్టర్లు, ఆర్థిక ప్రణాళిక శాఖ అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త సంవత్సరం సమస్యల రహితం కావాలని పిలుపునిచ్చారు. రూ. 334 కోట్లతో క్రిస్మస్, సంక్రాంతి కానుకలను ఇస్తున్నామని గుర్తు చేశారు. ప్రతి కుటుంబంలో పండగ సంతోషం కనిపించాలన్నదే తన అభిమతమని తెలిపారు. నగదు కొరత చింత తీరితే కొత్త సంవత్సరంలో అంతా సంతోషమేనని, ప్రజలను కష్టాల నుంచి దూరం చేయాల్సిన బాధ్యత బ్యాంకర్లపైనా ఉందని అన్నారు.
కుటుంబ వికాసం, సమాజ వికాసం సూత్రాలను ప్రజలు విధిగా అమలు చేయాలని చంద్రబాబు కోరారు. ప్రతి ఒక్కరి వద్దా డెబిట్ కార్డు, ఫోను, కనీస నగదు ఉంచుకోవడమే ఆర్థిక కష్టాల సమస్యకు పరిష్కారమని సూచించిన ఆయన, వచ్చే రెండు రోజుల్లో 10 వేల ఈ-పోస్ యంత్రాలు రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. సమీప భవిష్యత్తులో 50 వేల ఈ-పోస్ యంత్రాలను తెప్పిస్తామని, వాటి ద్వారా నగదు రహిత సమాజ సృష్టికి ప్రభుత్వం తనవంతు కృషి చేస్తుందని అన్నారు. సంక్రాంతి సందర్భంగా గ్రామీణ క్రీడలు, కళారూపాలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు సీఎం తెలిపారు. విశాఖపట్నం నమూనాగా అన్ని ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల దరఖాస్తులను పూర్తి చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.