: తప్పుడు వార్త చదివి ఇజ్రాయిల్‌ను హెచ్చరించిన పాక్ రక్షణ మంత్రి
ఓ వెబ్‌సైట్‌లో రాసిన తప్పుడు వార్తను చదివిన పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్ముద్ ఆసిఫ్ ఇజ్రాయిల్‌ను హెచ్చరించడంతో కలకలం రేగింది. పాకిస్థాన్ కనుక సిరియాకు తమ ఆర్మీ దళాలను పంపిస్తే, తాము అణ్వాయుధాలతో పాక్‌ను సర్వనాశనం చేస్తామని ఇజ్రాయిల్ రక్షణశాఖా మంత్రి హెచ్చరించినట్టు కొన్ని రోజుల క్రితం అవాద్ న్యూస్ డాట్‌కామ్ అనే వెబ్‌సైట్ వార్త రాసింది. ఈ వార్తలో రక్షణ మంత్రి అంటూ పేర్కొన్న వ్యక్తి మాజీ మంత్రి. అయితే ఆ న్యూస్ వెబ్‌సైట్ పొరపాటున ప్రస్తుత మంత్రి అని పేర్కొంది. ఈ విషయాన్ని పాక్ రక్షణ మంత్రి కూడా గుర్తించలేకపోయారు. దీంతో ఇజ్రాయిల్ తీరుపై మండిపడిన మంత్రి ఆసిఫ్ తమది కూడా అణ్వాయుధ దేశమేనన్న సంగతిని ఇజ్రాయిల్ గుర్తుంచుకుంటే మంచిదంటూ శనివారం ట్వీట్ చేశారు. దీంతో పాక్ మంత్రి తీరును దుయ్యబడుతూ 400 మంది రీట్వీట్ చేశారు. వెబ్‌సైట్ రాసింది తప్పుడు వార్త అని ఇజ్రాయిల్ ఖండించినా ఆసిఫ్ ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం గమనార్హం.