: రూ.కోటి కోసం మూడేళ్ల బాలిక కిడ్నాప్.. ఆపై దారుణంగా హత్య.. నిందితులు 16 ఏళ్ల విద్యార్థులు!
ముంబై మహానగరంలో దారుణం జరిగింది. డబ్బుల కోసం మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన ఇద్దరు విద్యార్థులు ఆమెను అత్యంత దారుణంగా హత్య చేయడం కలకలం సృష్టించింది. ముంబై పోలీసుల కథనం ప్రకారం.. ఓ స్క్రాప్ డీలర్ కుమార్తె అయిన తరనుమ్ ఫాతెమా అలియాస్ జునేరా(3) నాగపడాలోని ఆమె ఇంటి నుంచి ఈనెల 5న కిడ్నాప్ అయింది. చిన్నారిని కిడ్నాప్ చేసిన దుండగులు కోటి రూపాయలు డిమాండ్ చేశారు. ఫాతెమా కిడ్నాప్‌పై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆమె ఇంటి ఎదురుగా ఉన్న విద్యార్థిపై అనుమానంతో ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
చిన్నారి తండ్రి ముంతాజ్ ఖాన్ కారులో తిరుగుతుండడంతో అతడి వద్ద బోల్డంత డబ్బు ఉందని భావించిన ఆమె ఎదురింట్లో ఉండే ఇంటీరియర్ డిజైనర్ కుమారుడు అస్లామ్(పేరు మార్చాం) చిన్నారి ఆడుకునేందుకు తన ఇంటికి వచ్చినప్పుడు అప్పటికే తెచ్చిపెట్టుకున్న క్లోరోఫాంను వాసన చూపించి అపహరించాడు. అయితే ఆమె ముక్కునుంచి రక్తం కారుతుండడంతో భయపడిన అస్లాం ఆమె మెడకు మొబైల్ చార్జర్ వైరును బిగించి హత్య చేశాడు. అనంతరం ఓ ప్లాస్టిక్ బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని చుట్టి ఆమె ఇంటికి కొద్ది దూరంలో ఓ ఇంటిపై నున్న వాటర్ ట్యాంకు వెనక దాచిపెట్టాడు.
బాలికను కిడ్నాప్ చేసిన తర్వాత నిందితుడు వివిధ పోన్ నంబర్ల నుంచి రూ.కోటి డిమాండ్ చేస్తూ 24 కాల్స్ చేశాడని పోలీసులు తెలిపారు. చివరికి బాధిత తల్లిదండ్రులతో రూ..28 లక్షలు ఇస్తామని ఒప్పించి కాల్‌ను ట్రేస్ చేశామని తెలిపారు. అయితే తీసుకున్న ఫోన్ నంబర్లన్నీ నకిలీ డాక్యుమెంట్లు ఉపయోగించి తీసుకున్నవేనని తెలిపారు. ఈ నెల 23న మరోమారు ఫోన్ చేసిన కిడ్నాపర్ డబ్బు సంచిని కల్వా టన్నెల్ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద పడేయాలని సూచించాడు. అయితే డబ్బులు వేయడానికి ముందు తన కుమార్తెను చూపించాలని చిన్నారి తండ్రి డిమాండ్ చేశాడు. ఈలోపు అక్కడే కాపు కాసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు తప్పించుకుని పరారయ్యారు.
ఆ తర్వాత కిడ్నాపర్ వాయిస్ కాల్స్‌ను విశ్లేషించగా అది ఓ టీనేజర్‌ది అయి ఉంటుందని భావించి ఆ కోణంలో దర్యాప్తు చేశారు. చివరికి ఈ ఘటనపై పోలీసులకు రహస్యంగా సమాచారమిచ్చిన జావేద్(పేరు మార్చాం) సహాయంతో అస్లాంను అదుపులోకి తీసుకుని విచారించగా తొలుత జావేద్ అబద్ధం చెబుతున్నాడని బుకాయించాడు. దీంతో జావేద్ ను తీసుకురావడంతో నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామని, వారిద్దరూ ముంబై కాలేజీ విద్యార్థులని పోలీసులు తెలిపారు. అస్లాం ఇచ్చిన సమాచారంతో వాటర్ ట్యాంకు వెనక దాచిన చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.