: చిలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.7 గా నమోదు.. సునామీ హెచ్చరిక
భారీ భూకంపం చిలీని వణికించింది. ఆదివారం దక్షిణ చిలీలోని ప్యూర్టో మాంట్ నగరానికి 225 కిలోమీటర్ల దూరంలో భూమికి 15 కిలోమీటర్ల లోతున సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది. భూకంపం సంభవించిన విషయాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే నిర్ధారించింది. భూకంప నష్టంపై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు. అయితే సునామీ హెచ్చరికలు మాత్రం జారీ అయ్యాయి. భూకంప కేంద్రం నుంచి వెయ్యి కిలోమీటర్ల పరిధిలో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్టు అమెరికాకు చెందిన పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ పేర్కొంది. నేవీ కూడా ఇవే హెచ్చరికలు చేసింది.
సునామీ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటి వరకు నాలుగు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2010లో చిలీలో 8.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కారణంగా సునామీ వచ్చి 524 మంది మరణించారు.