: బ్యాంకు సీఈవోపై కాల్పుల కేసులో ముగ్గురి అరెస్టు
హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లో కేబీఎస్ బ్యాంకు సీఈఓ మన్మథ్ దలైపై జరిగిన కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 18న మన్మథ్ దలైపై దోపిడీకి యత్నించిన దుండగుడు రెండు రౌండ్ల కాల్పులకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ కేసులో మొత్తం నలుగురు వ్యక్తులను నిందితులుగా గుర్తించామని, అయితే, ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి దేశవాళీ తుపాకీతో పాటు 12 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మహేందర్ రెడ్డి చెప్పారు.