: ఎన్నికల్లో కొడుక్కి సీటు వచ్చినందుకు తెగ బాధ పడుతున్న తండ్రి!


పంజాబ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కొడుక్కి సీటు వచ్చినందుకు అతని తండ్రి తెగ బాధపడిపోతున్నాడు. తండ్రితో పాటు అతని సోదరుడు కూడా దీనిని జీర్ణించుకోలేకపోతున్నాడు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ఖేమ్ కరణ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు సుఖ్ పాల్ సింగ్ కు టికెట్ లభించింది. అయితే, సుఖ్ పాల్ సింగ్ తండ్రి గురు చేత్ సింగ్, అతని సోదరుడు అనూప్ సింగ్ లు మాత్రం తెగ బాధపడిపోతున్నారు. ఎందుకనే విషయాన్నివివరిస్తూ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి గురుచేత్ సింగ్ లేఖ రాశారు. తన ఇద్దరు కుమారులైన సుఖ్ పాల్ సింగ్, అనూప్ సింగ్ మధ్య విభేదాలు ఉన్నాయని, వారిద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని ఆ లేఖలో రాసిన ఆయన, ఆ నియోజకవర్గం టికెట్ తనకు ఇవ్వాలని కోరారు.

అనూప్ సింగ్ సైతం సోనియాకు ఒక లేఖ రాశారు. తన సోదరుడు సుఖ్ పాల్ సింగ్ పై అనేక ఆరోపణలు ఉన్నాయని, ఇందిరాగాంధీ హంతకులకు నివాళులర్పించే కార్యక్రమంలో సైతం తన సోదరుడు పాల్గొన్నాడని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఆ లేఖతో పాటు ఇందుకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ లను కూడా జతపరిచాడు. కాగా, ఖేర్ కరణ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ పొందిన సుఖ్ పాల్ సింగ్ కూడా తన వాదనను వినిపిస్తున్నాడు. 1998 నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని.. తాను పోటీ చేసే విషయమై తమ కుటుంబం గతంలోనే నిర్ణయం తీసుకుందని, 2012 ఎన్నికల్లో తన తండ్రి పోటీ చేసే సమయంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పాడు.
 

  • Loading...

More Telugu News