: చెన్నై నల్లబాబులను బెంబేలెత్తిస్తున్న ఐటీ అధికారులు.. హైదరాబాద్, ఢిల్లీ నుంచి 20 కంపెనీల పారామిలటరీ బలగాలు.. ఏ క్షణమైనా దాడులు
తమిళనాడు నల్లబాబులకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు దడ పుట్టిస్తున్నారు. వారం రోజుల్లో వంద చోట్ల సోదాలు నిర్వహించిన ఐటీ శాఖ శనివారం శేఖర్‌రెడ్డి వ్యాపార భాగస్వాములైన రామచంద్రన్, రత్నం నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిపింది. ప్రస్తుతం పుళల్ సెంట్రల్ జైలులో ఉన్న రత్నం, రామచంద్రన్ బెయిలు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా రాష్ట్రంలోని మరింత మంది నల్లకుబేరులపై దాడులు నిర్వహించాలని నిర్ణయించుకున్న ఐటీ తమ వద్ద సరిపడినంత సిబ్బంది లేకపోవడంతో హైదరాబాద్, ఢిల్లీ నుంచి వందమందికిపైగా అధికారులను చెన్నై రప్పించింది.
అలాగే 20 కంపెనీల పారా మిలటరీ బలగాలు కూడా నగరంలో కాలుమోపాయి. దీంతో ఈసారి నిర్వహించబోయే తనిఖీలు తీవ్ర స్థాయిలో ఉంటాయని భావిస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఇంతమంది అధికారులు, పారామిలటరీ బలగాలు చెన్నైకి చేరుకోవడంతో నల్లబాబుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఏవైపు నుంచి దాడులు జరుగుతాయో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.