: జయ మరణంతో శూన్యంలోకి తమిళ రాజకీయాలు.. త్వరలో వాస్తవాలు వెలుగులోకి.. శశికళా పుష్ప
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతితో తమిళనాట రాజకీయాలు శూన్యంలోకి వెళ్లిపోయాయని అన్నాడీఎంకే నుంచి ఉద్వాసనకు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళా పుష్ప అన్నారు. అమ్మ మృతిపై నెలకొన్న అనుమానాలు త్వరలో నివృత్తి అవుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం ఆమె మెరీనాబీచ్‌లోని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జయలలిత ఆస్పత్రిలో చేరిన దగ్గర నుంచి ఆమె మరణం వరకు అంతా గోప్యంగా ఉండడం బాధాకరమైన విషయమని అన్నారు. అమెకు అందించిన చికిత్సపై ఇప్పటి వరకు సరైన వివరాలు వెల్లడి కాకపోవడం శోచనీయమన్నారు. అమ్మ మృతిని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఆమె మృతిపై విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.