: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. లోక రక్షకుడిని స్తుతిస్తూ గీతాలాపన
లోక రక్షకుడు ఏసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్‌ను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. శనివారం అర్ధరాత్రి నుంచే చర్చ్‌లకు చేరుకుంటున్న క్రైస్తవులు ఏసుక్రీస్తును స్తుతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మెదక్‌లోని సీఎస్ఐ చర్చికి చేరుకున్న వేలాది మంది క్రైస్తవులు ప్రార్థనల్లో మునిగిపోయారు. క్రిస్మస్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని చర్చ్‌లను విద్యుద్దీప కాంతులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇక భాగ్యనగరంలోని అన్ని చర్చ్‌లు భక్తులతో కళకళలాడాయి. క్రైస్తవులకు పరమపవిత్రమైన ఆదివారం రోజే క్రిస్మస్ రావడంతో ప్రార్థనలకు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడు సహా పలువురు ప్రముఖులు క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.